*** మానవ జీవితం ***






తినడానికి లేక డొక్క పట్టుకున్నోడొకడు
తిన్నది అరక్క ఆసుపత్రుల చుట్టూ తిరిగెనొకడు 
వున్ననాడు అస్తు, లేనినాడు పస్తు అంటాడింకొక్కడు

చెట్టైనా పుట్టయినా గుడిసె ఆరుబైటయినా 
గురుతు రాక గుర్రుపెట్టి పండుతాడొకడు 
రేపేంటో మాపేంటో పిల్లా జల్లా బ్రతుకేంటోనని 
అర్ధ నిద్రతో అరుగుమీద ఇంకొకడు 
దొంగొస్తాడో దొరొస్తాడో దాచిందంతా దోచుకెళ్తారని 
నిద్రపోక నీడని చూసికూడా భయపతాడింకొక్కడు 

ఏమీ జీవితమయ్యా.. మానవ జీవితం 
వున్నోనంటాడొకడు, లేనోన్నంటాడొకడు  
వుండీ లేక వున్నానంటాడింకొక్కడు ... 

ఛీ! దీనెమ్మా జీవితం... 
యిదే.. "మనీ"షి జీవితం
 
 
 

మహిళా దినోత్సవం


రూపం తెలియని నా తనువుకు  ఊపిరిలూదింది. 

నేలను తాకని నా పాదాలను తన కడుపున దాచింది. 

కలలు కనడమే తెలియని నా కనులకు,     

మొదట తన రూపం చూపింది. 

పదాలు తెలియని  నా పెదాలకు,

మొదట అమృత వాక్యం తానే.  

తన ఒడి నుండి బడికి పంపినా,

బడి నుండి బస్తీకి పంపినా, 

బస్తీ నుండి బాహ్య ప్రపంచానికి పరిచయం చేసినా, ఒక్కటే కంగారు... 

ఎలా ఉన్నానో...  ఎలా ఉంటానో అని. 

నేను తప్పు చేసినా వెనకేసుకురావడం గురుతే, 

ఇంటికి చేరే వరకు గుమ్మం వద్ద ఎదురు చూపూ గురుతే,

బాగోక మంచాన పడితే.. నిదురలేని నీ కన్నులు గురుతే,

నా జీవితాన అన్నిటా, అంతటా నువ్వే... 

అమ్మా.. 

నువ్వు నా బిడ్డగా నా కడుపున పుట్టినా 

నువ్వు నన్ను  చూసుకుంటున్నంత ప్రేమగా 

నేను చూసుకోలేనేమో !!!! 


                                                              నిష్ఠ (గోపి బుడుమూరు)