***అందమైన ఊహలు***

తలపుల్లోని నీ రూపం కళ్ళెదుట ప్రత్యక్షం... 
గిల్లుకొని చూస్తే.. కల కాదు నిజమే. 
కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి కవ్వించి
ఆత్రంగా తనువుని ఆక్రమిస్తున్న చేతులు..
బరువైన గుండె లయ, శ్రుతి తప్పి
ఎన్ని సార్లు కొట్టుకుంటుందో... 
వేడి వూపిరులు సెగలై.. నా మెడను తాకుతుంటే... 
తనువు అడుగు ఎత్తుకు లేచి ... 
గాలిలో తేలి నాట్యమాడుతుంది. 
ఇన్నాళ్ళు లేని కొత్త కోరికలు పురివిప్పి.. 
యుద్ధంలో శత్రువుని సంహరించినట్లు 
నాలోని కోరికలను నరకమంటూ... 
ముందుకు తోసే మనసు ఆత్రుతను ఆపలేక.. 
తాడిని పెనవేసిన మర్రిమాను వలె అల్లుకొని,
బిగి కౌగిలిలో వూపిరిల ఉసురు తీసేసినా... 
శృంగార యుద్ధంలో ఓడింది ఎవరైనా... 
విజయం ఇద్దరిదీ.
                  ... నిష్ట(గోపి బుడుమూరు)  

***ప్రకృతి మాయ***


నడి నెత్తిన సూర్యుని వేడిని తాళలేక, 
అలసి సొలసిన ప్రాణానికి.. 
సాయంత్రపు గాలి.. వింధ్యా మరలై తాకితే... 
పులకరించిన మేను  నాట్యమాడగా.. 
కరుణించిన మేఘం మేఘం ముద్దాడుకుని,  
చిరు చినుకు నేల రాలక ముందు 
నీ మోముని తాకి.. తన్మయత్వం తో... 
ఉల్లి పొరల  చీరను కట్టిన నీ తనువుపై జారి... 
తడిసిన అందాలను ఆస్వాదిస్తుంటే... 
అది చూసి.. చినుకుని రాల్చిన మేఘం మురిసిపోదా గుమ్మా... 
ఆ తాకిడికి తరించేను.. చినుకైపుట్టిన దాని జన్మ.. 
నీ వయ్యారాలను తాకగా చినుకునైనా కాకపోతినని అసూయ... 
కానీ.. ఏం చేయను.. యిదంతా ప్రకృతి చేసిన మాయ.  

                                                ... నిష్ట (గోపి బుడుమూరు)

***పగటి కలలు***

నిదుర కౌగిలికి కలత దూరం
కలత కనులకు కలలు దూరం
కలలుకనే మనిషికి నిజం దూరం
నిజమైన మాటకు మాయ దూరం
మాయమయ్యే డబ్బుకు సుఖం దూరం
సుఖమైన మనసుకు బాధ దూరం
కానీ... 
బాధనే నాకు మిగులుస్తూ...
దూరమైన నీ రూపం నా కనుల ముందర ఎన్నడో. 
నీ రూపాన్ని తలచుకుంటూ... 
నిదుర మరచిన నా కనులకు,
పగటి కలలు నిజమయ్యే రోజు ఎప్పుడో...

                        ---నిష్ట (గోపి బుడుమూరు)