**** పత్ని****

నువ్వే నా కంటి వెలుగు
నువ్వే నా హృదయ స్పందన
నీ నవ్వే నా జీవితం
నీ నిశ్శబ్దం కూడా నాకు కథలు చెబుతుంది.

నీ ప్రతీ ఊహ.. ప్రతీ భావన 
ఆ మాటలు...  నా మనసులో వెలిగే దీపాలే
నువ్వు నా వెంట ఉన్నప్పుడు
ప్రతి క్షణం ఆనందంతో తాండవిస్తుంది.

నీ రూపు.. నీ భావం... నీ ప్రేమ 
అవి  నా హృదయములో గాఢంగా నిలిచిపోవాలి
జన్మ జన్మలకీ.. ఈ బంధం శాశ్వతం కావాలి 
నీ శక్తి, నీ స్వేచ్ఛ నా జీవితంలో అసలైన సంపద.

నీకు ఎదురైనా  ప్రతి కష్టాన్ని 
నేను జయించాలనుకుంటాను
వేదనలు ఎదురైనా 
నీ కంటి చుక్క నేల జారనీయను 

ఇది కేవలం ప్రేమ కాదు
మనసుల బంధం, అవినాభావ సంబంధం
నీ జీవితం...  నా జీవితం
నీ ఆశలు... నా ఆశలు. 

నిదురలోని కలలో....  భార్య మీద ఇంత మంచి కవిత వస్తుందని 
కలలో కూడా అనుకోలేదు... 
ఇలా అని చెబితే... మా ఆవిడ ఏమైపోతుందో.. 
లేక... నన్నేమైనా చేస్తుందో ఆ దేవుడికే తెలియాలి..  

                                                                                 -- నిష్ఠ (గోపి బుడుమూరు)

***** రైతు *******

 నా దృష్టిలో రైతే.. దేవుడు 

పుడమిలోని మట్టికి గురువు 

అతని చేతిలో గడ్డి.. గులాబీలౌతుంది 

మట్టి.. మాణిక్యాలనిస్తుంది 

అతనిని చూసిన చాలు, 

చేలు..   తరంగాలౌతాయి. 

తాను గుక్కెడు నీళ్లు తాగకపోయినా 

నెర్రెలు నడుమ చస్తున్న తమకు  నీళ్లు పోసాడని కాబోలు. 

పశువులు..  పరవశించి పోతాయి 

శిశువుల్ని, స్నేహితుల్ని తమలో చూసుకుంటూ... 

బదులు రాదని తెలిసినా తన భావాలు పంచుకున్నాడని అనుకుంటా... 

చచ్చిపోతున్న చేనుల తడి , 

బ్రతికున్న పశువుల నాడి తెలిసిన 

నీకన్నా పెద్ద దేవుడు ఎవరు స్వామీ...!  

                                                                నిష్ట (గోపి బుడుమూరు)





****విజయ తీరం******

 దృఢ  విశ్వాసం నా  మదితో ముడిపడింది ,
ప్రతి అడుగులోనూ తోడు  నిలబడింది 

ఎంతగానో నిండిన ఆశతో,
నా కలలకు దారితీసే నడక!

నిదురలేని  రాత్రులు, ఛిద్రమైన  దారులు,
శ్రమతో తడిసిన తనువు , అలసిన కన్నులు... అయినా ,
ప్రతి క్షణం నా మనసులో కొత్త జ్వాల,
తలుపుల్లోనూ విజయం కోసం తహ తహలాడుతుంది.

అడ్డంకుల గోడలు ఎన్ని ఎదురైనా.. 
నా స్వప్నాన్ని అడ్డుకోలేవు, నన్ను ఒక్క చోట నిలిపి వుంచలేవు,

సమయం గడియలు ముందుకు సాగుతున్నా... 
నా  కాలి  మడమలు వెనక్కి తిరగవు 

లక్ష్యమే నా జీవనవిధానం,
ప్రతిసారీ వెతుకుతా  కొత్త దారులు,
విజయపు బావుటా  ఎగరవేసే వరకు,
ప్రాణం పణం పెట్టైనా  విజయ తీరం చేరుతాను!

                                                                            నిష్ఠ (గోపి బుడుమూరు)