*** నేటి సమాజం ***

అడిగే గొంతును, 

అధికారం నొక్కేస్తుంది.  

కాదంటే.. కానరాని రౌడీల కత్తులతో కోసేస్తుంది. 

రాలిన నెత్తుటిని,

 కళాలు.. సిరాకింద  వాడుకొని, 

అన్యాయంపై కోకొల్లలు కావ్యాలు రాశాయి.  కానీ, 

అదే.. అడిగే మరో గొంతుక కాలేకపోయాయి.

నరాలు చచ్చుపడిన నవ సమాజంలో 

మచ్చుకైనా ఒక పిడికిలి పైకి లేవలేకపాయె.. 

తల దించుకు పోవటం అలవాటైన జనాలకు 

తలెగరేసే రోజు ఎప్పుడొస్తుందో...?
                                                                ... నిష్ఠ (గోపి బుడుమూరు)



*** చివరి రోజులు ***

 మనిషి జీవన యాత్ర ముగియకుండా సాగితే.. 

ఇక పెరిగిన వయసులో వేరొకరిపై  ఆధారం. 

ఉద్యోగ  విరమణ  పొంది 

జేబులు ఖాళీ అయిన  తరువాత 

కన్నవాళ్ళ నమ్మకాలు గల్లంతై 

కాచుకున్న సంపదలు చేతులు మారాక 

పిల్లలు అందనంత ఎత్తు ఎదిగిపోతే...

మా వైపు తిరిగి చూసే సమయం లేకపోతే 

తమ ఆనందాలకు మేమే అడ్డని భావించి 

తమని బ్రతికించిన మా బ్రతుకులే 

భారమని భావించి రోడ్డున పడేస్తే... 

కళ్ళల్లో కన్నీటి జాడలతో 

ఏవేవో ఆలోచనలతో గుండె కొట్టుకుంటుంటే... 

అసహనంగా, నిస్సత్తువుగా... 

కదులుతున్నాయి మా కాళ్ళు వృద్ధాశ్రమం వైపు..

పిల్లల చివరి చూపుల పై ఆశలు సన్నగిల్లిన 

మా మనసుల ఆలోచనలు మహా ప్రస్థానం వైపు. 

                                                  

                                                                               .. నిష్ఠ ( గోపి బుడుమూరు)





*** బాల్య స్నేహం ***

 బాల్యంలో పసి మనసులు కలసిన వేళ

నవ నడవడికి బాటలు వేస్తున్న వేళ

మచ్చుకైనా మాయ తెలియని మనసులు 

స్వచ్ఛమైన నవ్వులు

ఇష్టమైన ప్రేమలు 

ఆటలు

పాటలు 

అల్లరి చేష్టలు... 

ఎందుకైనా దుఃఖం అంటే తెలియని రోజులు 

ఎంత ఎదిగినా మరపురానివి,

మారచిపోలేనివి  బాల్య స్నేహాలు 

                                                         ... నిష్ఠ (గోపి బుడుమూరు)                                       







*** మన మధ్య దూరాలు ***

నాకు నీకు మధ్య  జ్ఞపకాలు  

చీకటి రాత్రుల అడుగుల గురుతులాయె 

వర్షపు తడిలో కన్నీరులాయె 

మూగవాని ఆశల మాటలా యే 

చెవిటివానికి చేరని సంగీతమాయె

దాహార్తిని తీర్చలేని సాగర జలాలాయే 

ఎడారి నడుమన ఎండమావులాయె 

శిశిర ఋతువుల కొమ్మల చిగురులాయె 

అమావాస్య వెన్నెలలాయే.. 

కలలో కూడా మనం కలుసుకోవద్దనే 

రీతిన వున్నాయి మన భావ జాలాలు... 

సిద్ధాంతాలు వేదాంతాలు కూడా పూడ్చలేని 

అఘాదాలు మన మధ్య దూరాలు. 


                                                                  నిష్ఠ (గోపి బుడుమూరు)