+=+ మరలిరాని ప్రియా +=+

కలసి రాని కాలంలో శిధిలమైన ఓ రూపమా, 
కళలను వీడి కాళ్ళ ముందుకు రాలేవు కదా?
కన్నీటి ధార సాక్షిగా  వీడ్కోలు పలికాను కదా!
మరపు రాని జ్ఞాపకమై చిత్రవధ  చేయకు,
పగిలిన అద్దంలో ప్రతిబింబాలై .

ముగిసిన గతం ఓ కలగా సాగిపోదని నాకు తెలుసు
ముల్లులా నా మనసును గుచ్చుకుంటుంది కూడా తెలుసు
చేసేది లేక చేతకాని వాడిలా చోద్యం చూస్తున్న నాకు,
చచ్చి  నిన్ను చేరే ధైర్యం కూడా లేదు.. 
బ్రతికి నిన్ను మరిచి పోయే హృదయమూ కాదు. 
అందుకే, నరకంలో శిక్షలన్నీ నట్టింట్లో అనుభవిస్తున్నాను. 

మరుపు మనిషికి శాపం అంటారు ఈ లోకంలో
మరణందాకైనా మరుపు నా మతి ని కమ్మేస్తే..
చివరి క్షణాల్లో వుండాలనుకుంటున్నా చిన్న పిల్లాడిలా
ఎదిగిన వయసు... మరచిన మనసుతో..... 

                                                                         -- నిష్ఠ

                                                                  

... జైకిసాన్....

పురాణాలు ఇతిహాసాలు వ్రాసి ఋషులైన ఓ మనుషులారా
కనపడలేదా మీకు కృషి చేసిన కర్షకుడి గాధ 
పంటను సాగు చేయాలనే తపననే ధ్యానంగా 
లోకానికి పట్టెడన్నం పెడితే.. అదే మోక్షంగా భావించే,
రైతు కష్టం లో నష్టం వెనుక కదా దాగిలేదా.. 
పురాణ పురుషుల గురించి కదిలే తమ  కలాలు
పక్కనే ప్రాణాలను సైతం పణం పెట్టే రైతు గురించి కదలలేదా 
దేశాన్ని శాసించే మీ గళాలు 
కదిలించలేకపోయాయా   రైతన్న నాగళ్లు 
తనకి కావాల్సింది సర్కారు ప్రకటించే మద్దతు ధర కాదు 
నీకోసం మేమున్నామంటూ చెప్పే సామాజిక మద్దత్తు 
జైకిసాన్ అని పుస్తకాల్లో ప్రకటించే కీర్తి వద్దు
కిసాన్ కూడా ఓ ఇన్సాన్ అని గుర్తిస్తే చాలు
హమ్ హై జవాన్...  హామ్ హై కిసాన్...
సబ్ లోగ్ సాదా సీదా ఇన్సాన్ .


                                                                  -- నిష్ట  

..... దర్శనం.......


జీవితంలో ఒక్క క్షణం ఆగిందంటే
అది నిన్ను చూసిన తరుణమే
గుండె దడ అమాంతం పెరిగి
అలా నిలిచిపోయిందంటే నమ్ముతావా
నన్ను నేను మరచిపోయిన ఆ నిమిషం
నా కన్నులకు నీ పైనే ధ్యాస
నువ్వు ఎటు తిరిగితే అటువైపే చూపులు
నీ ప్రతి భంగిమను తనలో ఇముడ్చుకునేందుకు
పడే తాపత్రయం నా మనసుకు తెలుస్తుంది
కానీ, ఏంచేయను ఎక్కడినుంచి వచ్చావో..
మెరుపులా మెరిసి మాయమైపోయావు
నీ వలపుల తలపులు నా మదిని తొలుస్తుంటే
ఆ జ్ఞాపకాలతోనే.. ఎదురు చూస్తున్నా...
మళ్ళీ ఎప్పుడైనా, ఎక్కడైనా.. దర్శనమిస్తావేమోనని. 

                                                                             ..... నిష్ఠ