నా నడకకు ఊతం తన చూపుడు వేలు
నా భవితకు ఆయనే పెద్ద భరోసా
మా కుటుంబానికి భద్రత మరియు పెద్ద దిక్కు
నేను కనే కలలకు వెనుక అయన నిరంతర కష్టం
సమాజంలో నన్ను ఉన్నత స్థాయిలో ఉంచాలని తన కోరిక
కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరిగిపోతున్నా
తనకోసం అంటూ తాను ఎప్పుడూ ఆలోచించని మహర్షి
నా ముందు కరుకైన మనసు, మృదువైన ఆవేశం
అదే అమ్మముందు అందరి ముందు మాత్రం
నా పిల్లలంటే ఏమనుకున్నావోయ్.. అంటూ అందలంలో వుంచుతావు
నువ్వు నాకో దార్శకుడివి
నాకు.. నా కలలకు మధ్య వారధివి
నేను నా జీవితంలో ఏది పొందినా
అది నువ్వు నా కోసం చేసిన త్యాగమే..
నన్ను యింత ఉన్నతంగా వుంచడానికి
ఎన్ని కోల్పోయావో.. ఎన్ని వద్దనుకున్నావో..
నాన్నా...
నువ్వేమిటో ...
నువ్వు పడ్డ కష్టమేమిటో ...
చేసిన త్యాగమేమిటో...
నేను నాన్నైనాకే, బోధపడుతోంది.
నాకు మళ్ళీ జన్మంటూ వుంటే..
నీకు నాన్నగా పుట్టి,
నీ ఋణం తీర్చుకోవాలని వుంది నాన్నా..
... నిష్ఠ (గోపి బుడుమూరు)