కరోనా మహమ్మారి కమ్మేసిన జీవితాలు
చేసేందుకు పనిలేక, తాగేందుకు గంజిలేక
నిలువు నీడలేక.. సాయమందించే తోడులేక
పట్నమెందుకొచ్చామురా.. మహాప్రభో అని రోదిస్తూ..
పల్లెవైపు నడుస్తోంది నా దేశం
వేసవి వడగాల్పులు ఓ వైపు
సముద్ర వాయుగుండాల తుఫాను ఓ వైపు
కాలే కడుపులు ఓ వైపు
నెత్తిమీద కదలనివ్వని బరువులు ఓ వైపు
అయినా, కాళ్ళకు చెప్పులు లేక,
కనకనలాడే నిప్పుల కుంపటి రోడ్డుమీద
బొబ్బలెక్కిన పాదాలతో..
పల్లెవైపు నడుస్తోంది నా దేశం
అంటురోగమొకటి చంపుతుందని తెలిసినా
ఆకలి చావుని మించిన దయనీయ చావు వేరొకటి లేదని..
ఆగే దిక్కు లేక.. అడిగే హక్కు చాలక..
అలసిన వలస జీవికి వేరే వీలు తోచక..
అన్నమో రామచంద్రా అంటూ...
పల్లెవైపు నడుస్తోంది నా దేశం
నా దేశం "నడుస్తుంది".
నా దేశం "నడుస్తూంది".
నా దేశం "నడుస్తూనే వుంది"!!
.... నిష్ఠ (గోపి బుడుమూరు )
కరోనా సమయంలో రాసిన కవిత ఇప్పుడు ప్రచురించాను..
No comments:
Post a Comment