*** మాకే మాటుంటే..! ***

🌿 మా హృదయం మాట్లాడితే 🌿
(అడవి జంతువుల, పక్షుల వేదనకు స్వరం)

మేము ముందునుంచే వుండేవాళ్ళం 

అడివి చెట్లల్లో, పుట్లల్లో, రాళ్ళలో, పొదల్లో.. 

మీ తాతలతో  తగవులు లేవు 

మీ తండ్రులతో తంటాల్లేవు 

మీరు రాగానే మారింది మా జీవన దృశ్యం 

మర రంపపు మోతలతో నాశనమైంది మా ప్రపంచం.  

మీ ఇళ్ల వెలుగుల కోసం మా అరణ్యాన్ని అంధకారం చేసావు 

అభివృద్ధి అన్న పేరుతో మా జీవితాల్ని మింగేశావు 

మా బ్రతుకులపై చెరగని గాయాన్ని మిగులుస్తూ.. 

 జగతిని నాశనం చేసే ఈ ప్రయాణం ఎంత వరకు..!


మా  ఆక్రందనల ఘోష నీ చెవిన పడలేదా

మా నచ్చని వలస ప్రయాణ కన్నీరు కనపడలేదా 

మా అడవుల్లో చొరబడి వెంటాడినా.. వేటాడినా.. 

అడగలేమనే  హక్కుతోనే  కదా..  యింత విధ్వంశం 


భావి తరాల భవిష్యత్తుని పణం పెట్టి, 

ప్రకృతితో నీ ఆటలు... మానవజాతి వినాశనానికి బాటలు.  

జీవ వైవిధ్యం మన మనుగడకి కావాలి సోపానాలు. కానీ, 

మానవ,పశు, పక్షి, వృక్షజాలాలకు, కాకూడదు స్మశానాలు. 

                                                    --- నిష్ఠ (గోపి బుడుమూరు)










*** పుష్పాంజలి ***

                            నా జీవిత జ్ఞాపకాల అల్లికల వానలో 

                            ఓ అదృశ్య గొడుగులా నువ్వు వున్నావు నాన్నా!

                            నా కలల గమ్యాల పాదాలకు 

                            పాదరక్షలై  నీ అనుభవాలే దారిచూపాయి 

                            

                            మౌనంగా  మెరుస్తున్న నీ చూపుల్లో 

                            మాటల్లో చెప్పలేని నీ మమత వుంది 

                            నువ్వు నవ్వితే నాకు ఆకాశమైన దిగొస్తుంది 

                            నువ్వు బాధపడితే.. నా శ్వాసే ఆగిపోతుంది 


                            నేను చదివిన పాఠాలకంటే, మీరు 

                            మౌనంగా నేర్పిన జీవితం చాలా పెద్దది 

                            ఈ జీవితం మీరు నాకిచ్చిన బహుమతి 

                            మీ కలలకు, ఆశలకు, చేసిన త్యాగాలకు 

                            మీరు గర్వంగా మలచిన కొడుకుగా 

                            మీ పాదాలకు ప్రేమతో  పుష్పాంజలి 

                                                                                            -- నిష్ఠ (గోపి బుడుమూరు) 

                            

                            

                 

**** ప్రేమ పాఠం ****

 మన జీవితాల్లో సూర్యోదయం కావాలని 

నిద్రలేని రాత్రులు గడిపాను 

నా మనసున ప్రతి పొరపై నీ రూపం గీసుకున్నాను 

ఈ రోజు నిశ్శబ్ధం మాత్రమే నాకు తోడైంది 

నీ చిరునవ్వే నా లోకమనుకున్నా 

ఆ  నవ్వులు వేరొకరి సొంతమని తెలియక

గడిచిన క్షణాలు వెన్నెలగా భావించాను 

ఇంతటి వేదన జ్వాలల్ని రగిలిస్తాయని అనుకోక  

ఓ తరం మారింది, ఆ కల అలానే మిగిలింది 

ఆ ప్రేమ సాగరం చిక్కకపోయినా

ఆ గాలి పరిమళం నా ఊపిరిలో మిగిలింది 

నువ్వు నన్ను వదిలి పోయింది నిజమే 

కానీ, నువ్వు నేర్పిన పాఠం మరువలేనిది

విఫలమైన నా ప్రేమను నేను ఓటమిగా చూడను 

ఇకపై  నీకోసం ఆలోచించే ప్రతి క్షణం.. 

నా ఎదుగుదల కోసమే ఆలోచిస్తాను 

మన ప్రేమ ముగిసిన తర్వాతే... 

నా జీవితపు అసలైన కథ మొదలైంది

నన్ను ఉన్నత శిఖరాన వుంచింది ... :-)

                                                                       -- నిష్ఠ (గోపి బుడుమూరు )