** అసూయ **

ఆడ గుండె లోతు చూసి.. సాగరం చిన్నబోయింది
ఆమె ఆత్రుత చూసి, నింగి నివ్వెరబోయింది
సోగాసుమీద మమకారాన్ని చూసి, చందమామ చతికిలబడితే
నడుము మడత వయ్యారాన్ని కని, నదులు నివ్వెర పోయాయి.

అయినా... బ్రహ్మ ఎంత పక్షపాతి...
పిడికెడు నడుము, బారెడు జడతో...
అన్ని అందాలను ఆమెకే.. అలంకరించాడు

మగవాడే అయినా... తన వాళ్లకు
రోషమని  చెప్పి, మోముకు మీసమిచ్చి...
ఆమె అందాన్ని చూడగానే..
కరిగిపోయే.. గుండెనిచ్చాడు

నవ్వుకు పోవడం తన సొంతమైతే...
నివ్వేరబోయి నిలబడడం మగవారి వంతైంది.

చందమామ, కలువభామ, సంపంగి, నదులు.. నక్షత్రాలు
దొండపండు, జామపండు, నాగుపాము.. వగైరా వగైరా ....
అన్నీ.. వారి అందాలను పొగడే  సాధనాలే..
మాకంటూ... చివరకు  ఏం మిగిల్చారు...
అడ్డ గాడిద..  దున్నపోతు  తప్ప.  

                                                     .... గోపి బుడుమూరు 

*** నా.. కల ***

వెదురునైనా... వేణువుగా మారినా
చిరుగాలినైనా... సుఘంధమైనా
జన జీవన 'కాన' లో నేనో చిన్న మొక్కని

తల్లిదండ్రులు.. హితులు.. సన్నిహితులు..

మహా వృక్షాల శాఖల నీడన సేదదీరినా...
గడ్డుకాలం, గతి తప్పిన రాశుల  వెటకారపు వేళ్ల చూపులు...
క్రూర మృగాల కాళ్ళ క్రిందనో... నీతి లేని పశువుల దానానో...
కంచె.. మంచె.. జాడలేని.... తీగ రాని మరుమల్లి.

నాటు వేసినా... నీరు పైవాడిదే..

తెగ పెరిగిన గుబురుల తీరం దాటుకొని
సూర్య కాంతి పడి పులకరించి ...
మొక్క..  మానుగా మారి, నలుగురిని ఆదరించి...
క్రింద సేద దీర్చి, ఫలములతో ఫలితమిచ్చి
నిన్నటి, నాలాంటి మొక్కలకు నీడ నిచ్చి
మరో  కాన నిర్మాణం మరెంత దూరమో....


                            --- గోపి బుడుమూరు



      

*** అధికారం***

పదవి వున్నంత వరకు... చేతినిండా ధనం
ఊహించనంత పలుకుబడి. 
ఎందరో... నీకే తెలియని హితులు.. సన్ని హితులు 
అరి కాలికి మట్టంట కుండా అరచేతులు పరిచే..
అనుచరులు.. అభిమానులు.

ఈ తతంగం చూచి స్థానం మార్చి...

వున్న చోటు మరచి నెత్తి పైకి కన్నులు
కుర్చీ నుండి లేస్తే... సలాములు
కూర్చుంటే.. గులాములు...

అదంతా నీకే  అనుకుంటే...

నీయంత పిచ్చోడు ఈ.. లోకంలో లేనట్టే....

పొగడ్తలు .... సలాములు ...

మర్యాదలు... మన్ననలు...
యివన్నీ... నీ కుర్చీకే అని నువ్వు తెలుసుకునేసరికి
నీ.. స్థానమేంటో  నేను వూహించగలను.


                                        --- గోపి బుడుమూరు    









*** జై కిసాన్ ***


నలిగిన పంచె.. చిరిగిన చొక్కా... 

మహారాజు కిరీటానికి పోటీగా.. 
తల చుట్టూ తిప్పిన పాత తలపాగా.. 

అన్నీ వున్నా... ఏదీ కలసి రాక... 

ఆకలేస్తే... నేల వైపు,   దాహమేస్తే... ఆకాశం వైపు
ఆదరణ కోసం  నేతల వైపే.. వెర్రి చూపులు.. 

బక్క చిక్కిన డొక్క.. వెన్నుపూసను తాకుతున్నా

దీనంగానైనా... దైవం కరునించక పోతే... 
సాటి మనిషన్న సంగతే మరచిపోయిన  నేతలకా.. బీద రైతు పైన ప్రీతి. 

దేశానికి పట్టెడన్నం పెట్టడానికి, పట్టువదలని విక్రమార్కుడిలా... 

బ్రతుకును సాగదీసి... పంటను సాగు చేసి... 
రాజ్యాన్ని గెలిచిన రారాజులా... రాల్చిన పంటను తీసుకుని బజారుకెలితే... 

ఎండల వడదెబ్బల కంటే ఘాటుగా తగిలింది, దళారుల కాటా దెబ్బ. 

చేసేదేమీ లేక, చేతికందిందే పుచ్చుకొని తిరుగు ప్రయాణం. 

దళారుల దయవలన భూమిన వుండాల్సిన  ధరలు ఆకాశాన్నంటిన,

భూ.. ఆకాశాలనే నమ్ముకున్న రైతు కష్టానికి వెల నష్టం. 
బీడు వారిన నేలలకు  దీటుగా.. మోడువారిన రైతన్న జీవితం. 

అక్రోసించిన రైతన్న, ఓ... ఏడాది సమ్మె చేస్తే..... 

అప్పుడైనా.. అర్ధమౌతుందా.. ఆకలి విలువేమిటో... 

ప్రపంచానికి పట్టెడన్నం పెట్టాలనే తన ఆశను తీరుద్దాం... 

చితికిపోతున్న రైతన్నకు చేయందించి,  "జై కిసాన్" అని కీర్తిద్దాం.    


                                                             --- గోపి బుడుమూరు. 

                                                         
  

***ఒక్కరోజు మారాజు***



తలలు పట్టి, సిగ్గునొగ్గి, డబ్బు మరిగి 
రాజకీయ రాజ దర్బారులో.. ఓటు కొరకు మంత్రాంగం. 
కలలు కరిగి, ఆస్తులు తరిగి, చేవజచ్చిన 
పేద రైతు ఓటరు దగ్గరకు కదిలె, అధికార, ప్రతిపక్ష యంత్రాంగం. 

వంద నోటు, చికెను ముక్క, సారా చుక్క ఆశ చూపి,
అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా నీ సేవనే అని నమ్మ బలికి 
ఆకాశాన్ని వంచి, నీ నేలను తడుపుతామని,
నేలను వున్నా తన ఇంటిని ఆకాశంలో కట్టిస్తామని... 
ఒకటా..  రెండా... ఎన్నెన్నో .. వాగ్దానాలు... 

ఈ వాగ్దానాల వరదకు, దిమ్మదిరిగిన సగటు ఓటరు,
ఏ గుర్తుకు ఓటు వేయాలో తెలియని తికమకలో... 
ఏదో.. గుర్తుకి  ఓటు వేసి... గెలిచిన పార్టీదే..  తన ఓటంటాడు. 
సదరు నాయకుడు, గద్దెనెక్కాక గాని తెలియదు,
గతి తప్పిన  తన ప్రస్తుత స్థితి గురించి. 

తెలివి వచ్చి, తేరుకున్నాక తెలిసింది...  యిచ్చిన వాగ్దానాలు
గతించిన కాలంలోనే... భూస్థాపితం అయ్యాయని. 

చేసేదేమీలేక... చతికిలబడి, మళ్ళీ అయిదేళ్ళ కోసం ఎదురు చూపు...      
 ప్రచారం రోజు కాబోయే... "ఒక్కరోజు  మారాజు". 

                                                                ---గోపి బుడుమూరు.  




*** మేలుకొలుపు***

జగతికి మేలుకొలుపు నా పిలుపు 
శాంతికి చిహ్నం తెలుపు, అందరితో కలగలుపు
వెళ్ళే దారి ఏదైనా.. మనసులు గెలువు. 
చెడు కలుపును చంపి, మంచిని పెంచు. 
గర్వాన్ని అణచి, సగర్వంగా తల ఎత్తుకు తిరుగు.
అందుకే, నా పిలుపు జాతికి మేలుకొలుపు.   

నీకు నీవే సాటి కావాలి, నలుగురికి మార్గదర్శకంగా.. 

ప్రగతికి అడ్డు తగిలుతున్న వారిని మార్చి 
జాతి ముద్దు బిడ్డలుగా తీర్చు. 
అందుకే, నా పిలుపు జాతికి 'మేలుకొలుపు'.

కాకిలా కలకాలం కంటే.. హంసలా ఒక్కరోజు అన్నది నానుడి. 

హంసలా కలకాలం నిజం చేయి నీ నుండి 
జీవిత పరమార్ధం తెలుసుకునేందుకు తపస్సులేల?
పరోపకార, సత్య, ధర్మాలు చూపుతాయి నీలో లీల. 
అందుకే, నా పిలుపు జగతికి 'మేలుకొలుపు'. 

కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యాల నుండి ముక్తి,

కలుగుతుంది.. తెలుసుకున్నప్పుడే నీలో శక్తి. 
కానీయకు చేసిన వాగ్దానాన్ని వమ్ము. 
నీలో నిజాయితీ, శ్రమ లను నమ్ము. 
కాదేమో..  అని చుస్తే, ప్రతి సమస్య కొండంతే.. 
నిశితంగా.. పరిశీలిస్తే.. పరిష్కారం నీ పాదాల చెంతే. 
అందుకే, నా పిలుపు లోకానికి 'మేలుకొలుపు'

నేనే.. నీలో నేనై వున్న నన్ను చూసినపుడు,

సమాజపు పూదోటలో... నేను... ఓ.. వనమాలి. 
ఎదుటి మనిషి ముఖద్దం లో.. నీ రూపం ప్రతిబింబిస్తే.... 
నీవు పడిన శ్రమకు ప్రతిఫలం ఇదే అని ఆశించు...  
నీలి నీడలు పడిన సమాజాన్ని కొత్త రంగులతో ఆహ్వానించు.
అందుకే, నా పిలుపు లోకానికి 'మేలుకొలుపు'

                                ---  గోపి బుడుమూరు 
   




*** ఓ... జ్ఞాపకం ***

తన అన్న మాట మరచి
నేనే తను అన్న తలపు జ్ఞాపకమే...
నేను కలత చెందిన రోజు
తన కంటి కన్నీటి ధార జ్ఞాపకమే...

నీను గెలిచిన రోజున
తన గులాబి పెదవులపై
చిరు నవ్వు జ్ఞాపకమే...

నా కలలకు తనే రంగులు
నా పాదాలకు తనే అడుగులు
నా కళ్ళకు తనే కన్నీళ్లు
నా ఆశయాలకు తనే ఆశలు

యింత చేసి.. అంతలోనే  మాయమై
కోరుకున్న జీవితాన్ని  చేజార్చి పొయావు.

ఇది ఒకప్పటి చేతులు చాచి పిలిచిన  అదృష్టం.
ఇప్పుడు కధలా మారిన 'ఓ... జ్ఞాపకం'. 

                              --- గోపిబుడుమురు


*** నగరం నిదుర పోతున్న వేళ ***

నగరం మెల్లగా నిదుర లోకి జారుకుంటున్న వేళ...
కలలు మరచి.. కనులు తెరచి..
దేనికోసమో... ఈ వెతుకులాట..!

చిన్న నాటి ఊయల పాటల కోసమా...?
తెలిసీ.. తెలియకుండా...
చేయి దాటి పోయిన సరదాల కోసమా...?
ఏమౌతుందో తెలియని భవిష్యత్తు కోసమా...?

గడిచింది తిరిగి రాదు.
జరగబోయే దానిపై నీ ప్రమేయం లేదు.
కనుకనే.. కలవరమొదిలి..
కౌగిలికి ఆహ్వానిస్తున్న.. నిదురలోకి  జారిపోయి
నిన్ను నువ్వు మరచిపో.....

                                   --- గోపి బుడుమూరు.






***నివాళి***

మట్టిముద్ద  లాంటి నా మనసుకు,
            మమతను చేర్చి మనిషిని చేసావు.
శిలలాంటి  నన్ను శిల్పంగా మార్చి,
            చేతి నేర్పు వున్న శిల్పివైనావు.
కలలా కరిగి పోతున్న  నా జీవితాన్ని,
            కధలా మార్చిన  కవివి  నీవు.

రవివర్మ  చేతి కుంచేవో....
రగిలి పోతున్న విరహపు జ్వాలవో....

మరపురాని క్షణాలను నాకు మిగిల్చి,
మరలి రాని లోకాలకు  చేరిన.. ఓ... ప్రియతమా,

ఏమీయగలను  నేను....
నన్ను నన్నుగా.. నాకు చూపిన నీకు,
బాధను  దిగమింగుతూ... భారంగా 'ఓ.. అశ్రుధార ' తప్ప.

                                               .... గోపి బుడుమూరు.











****మనసు ప్రయాణం****

నిదురలేని నా కనులకు.. కలలు దూరం.
మనసులు దగ్గరగా వున్నా... ఒకరికి ఒకరు  మనం దూరం.
పలకలేని నా నోటికి పెదవులు వున్నా...
పెదవులు లేని.. నా కనులు మాట్లాడుతున్నాయి.
అలసిపోయి.. నా కన్నులు తడబడుతున్నా ....
కనులు లేని నా మనసు.. నీకోసం ఎదురు చూస్తున్నది.

నిన్ను చేరుకోవాలని.. నా పాదాలు పరుగు తీసి,
గమ్యం తెలియక, ఎడారి నడకలా మారితే...
బాధతో నా కన్నీళ్లే... నన్ను ఓదారుస్తున్నాయి.

లేదా... నా.. ఈ.. కాంక్షతో..  నీకు ప్రమేయం..?
ఎందాకో మరి.. నాకు కుడా తెలియని నా... మనసు ప్రయాణం.

                                                       .... గోపి బుడుమూరు.


                     

ఓ.. వర్షం కురిసిన సాయంత్రం

చిరు జల్లుల సవ్వడులు...
             చిరు మువ్వల అలజడులు.
ఎండా వానా మధ్య అందమైన హరివిల్లు...
            ప్రకృతి నడుము వడ్డానాల సోయగాలు.
ఉరుముల నాదాలు.....
            మబ్బుల ప్రియమైన పిలుపులు.
మెరుపుల తళుకు బెలుకులు....
            మేఘమాలల మెడలో నగల ధగ ధగలు.
ప్రకృతి, ఎండల చెమట పరికిణీలు వదిలి,
వానల చీరలో తడి అందాలు అరబోస్తుంటే.....

పొగడ తరమా... వాటిని కవుల కలాలు,
పాడతరమా...... వీటిని గాయకుల గళాలు.

                          .... గోపి బుడుమూరు.








**** తిరుగు ప్రయాణం ****

అజ్ఞానపు విష కోరలలో... 
విజ్ఞానపు వినాశనం . 
పరిజ్ఞాన పోకడలతో... 
దూరమవుతున్న  బంధాలు. 
నేరమవుతున్న సంబంధాలు... 
'కామం' లో జంతువులే .. సిగ్గు పడేలా... 
మానవ 'మృగాల'  అరాచకం. 
'నవ'నాగరికత అనే ముసుగుతో... 
అదే.. పాత అనాగరిక అడవిలోకి ''తిరుగు ప్రయాణం''.   

                                                                .....  గోపి బుడుమూరు  

***** "హత్య" ******



అర్ధరాత్రి ఆడది  స్వాతంత్ర్యాన్ని కలలు గన్న మహాత్ముడు,
స్వర్గజీవియై బ్రతికిపోయాడు గాని, లేకుంటే....
సమజంలో జరుగుతున్న  అన్యాయాన్ని చూసి...
గుండె పగిలి చచ్చి పోయేవాడు....
... అయినా లోకంలో ఎక్కడుంది స్వేచ్చ?
నమ్ముకున్న నాయకులు, ఏనాడో  చేసేసారు..
ప్రజాస్వామ్యాన్ని "హత్య".


                                                   --- నిష్ఠ (గోపి బుడుమూరు)