***పాల పీక***

ఆత్మలో ఘన చరితలు నింపిన 
కన్న భూమిని తలచుకుంటూ... 
అసువులు బాసినా... నైతికమే. 
 పరాయి గోడు విని.. పరాయి కూడు తిని.. 
నీ చెమటలను, చల్లని యాంత్రిక వింధ్యామర కు వదిలి..  
అచ్చమైన స్వచ్చమైన నీ దేశపు పైరగాలి ని గాలికి వదిలి... 
నువ్వు చేసిన సేవ ఫలితంగా  వచ్చిన ఆర్ధిక శోభను,  
నీ రూపంలో మన దేశం నుండి అరువు తెచ్చుకొన్న 
వారి భుజాలను "శభాష్" అంటూ చరిచి ... 
భారత మాత చనుబాలను తాగి..  
పర దేశపు 'పాల పీక' ను కొనియాడుట.. 
న్యాయమా.. ప్రవాసాంధ్రుడా.. 

                              --- నిష్ట (గోపి బుడుమూరు)


***అందమైన ఊహలు***

తలపుల్లోని నీ రూపం కళ్ళెదుట ప్రత్యక్షం... 
గిల్లుకొని చూస్తే.. కల కాదు నిజమే. 
కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి కవ్వించి
ఆత్రంగా తనువుని ఆక్రమిస్తున్న చేతులు..
బరువైన గుండె లయ, శ్రుతి తప్పి
ఎన్ని సార్లు కొట్టుకుంటుందో... 
వేడి వూపిరులు సెగలై.. నా మెడను తాకుతుంటే... 
తనువు అడుగు ఎత్తుకు లేచి ... 
గాలిలో తేలి నాట్యమాడుతుంది. 
ఇన్నాళ్ళు లేని కొత్త కోరికలు పురివిప్పి.. 
యుద్ధంలో శత్రువుని సంహరించినట్లు 
నాలోని కోరికలను నరకమంటూ... 
ముందుకు తోసే మనసు ఆత్రుతను ఆపలేక.. 
తాడిని పెనవేసిన మర్రిమాను వలె అల్లుకొని,
బిగి కౌగిలిలో వూపిరిల ఉసురు తీసేసినా... 
శృంగార యుద్ధంలో ఓడింది ఎవరైనా... 
విజయం ఇద్దరిదీ.
                  ... నిష్ట(గోపి బుడుమూరు)  

***ప్రకృతి మాయ***


నడి నెత్తిన సూర్యుని వేడిని తాళలేక, 
అలసి సొలసిన ప్రాణానికి.. 
సాయంత్రపు గాలి.. వింధ్యా మరలై తాకితే... 
పులకరించిన మేను  నాట్యమాడగా.. 
కరుణించిన మేఘం మేఘం ముద్దాడుకుని,  
చిరు చినుకు నేల రాలక ముందు 
నీ మోముని తాకి.. తన్మయత్వం తో... 
ఉల్లి పొరల  చీరను కట్టిన నీ తనువుపై జారి... 
తడిసిన అందాలను ఆస్వాదిస్తుంటే... 
అది చూసి.. చినుకుని రాల్చిన మేఘం మురిసిపోదా గుమ్మా... 
ఆ తాకిడికి తరించేను.. చినుకైపుట్టిన దాని జన్మ.. 
నీ వయ్యారాలను తాకగా చినుకునైనా కాకపోతినని అసూయ... 
కానీ.. ఏం చేయను.. యిదంతా ప్రకృతి చేసిన మాయ.  

                                                ... నిష్ట (గోపి బుడుమూరు)

***పగటి కలలు***

నిదుర కౌగిలికి కలత దూరం
కలత కనులకు కలలు దూరం
కలలుకనే మనిషికి నిజం దూరం
నిజమైన మాటకు మాయ దూరం
మాయమయ్యే డబ్బుకు సుఖం దూరం
సుఖమైన మనసుకు బాధ దూరం
కానీ... 
బాధనే నాకు మిగులుస్తూ...
దూరమైన నీ రూపం నా కనుల ముందర ఎన్నడో. 
నీ రూపాన్ని తలచుకుంటూ... 
నిదుర మరచిన నా కనులకు,
పగటి కలలు నిజమయ్యే రోజు ఎప్పుడో...

                        ---నిష్ట (గోపి బుడుమూరు)

స్వచ్చమైన ప్రేమ


ప్రేమ అనేది.. భాషకి అందని భావన
ఊహలు కూడా తాకలేనంత ఎత్తు
అది అనుబంధం తో తప్ప  మరే ఇతర సాధనం తోనూ.. కొలవలేము
రెండు మనసులు వేరైనా.. ఆలోచనలు ఒక్కటే అయితే.. జీవితం స్వర్గం
ఏ  ఒక్క మనసు తొనికినా... నరకప్రాయమే...
స్వచ్చమైన ప్రేమ.. మోసపోతే...  బ్రతుకు సజీవ శిలాజం.
అలాంటి స్వచ్చమైన ప్రేమ ఈ  కాలంలో దొరకడం అసాధ్యం.       


***ముసలమ్మ***

                                                  
ఎర్ర లైటు పడగానే... 
కూడలిలో అయ్యా అంటూ.. 
అర్రులు చాచి యాచిస్తున్న ముసలమ్మ
ధర్మాన్ని అడుగుతూ.. పుణ్యాన్ని పంచుతుందో... 
చేసిన పాపాలకు ఇలా ఖర్మనే అనుభవిస్తుందో.. 
కడుపున పుట్టిన వాళ్ళు కాటికి పోయారో.. 
కాదనుకుని కాళ్ళ దన్ని వదిలేసారో.. 
కాటికి పోవాల్సిన వయసులో... 
కార్చిచ్చు లాంటి ఎండన పడి.. 
కమిలిన ముఖంతో.. కాలుతున్న కడుపుతో... 
తెల్లారి పోవాల్సిన ప్రాణానికి  
ఈ బ్రతుకు భారపు బండి ప్రయాణం ఇంకెంత దూరమో..?

                     .... నిష్ట (గోపి బుడుమూరు) 

*** నిజమైన నాయకుడు***

 




ఒక్కడు మాంసమిచ్చె(శిబి చక్రవర్తి)
మరియొక్కడు చర్మము కోసి ఇచ్చె (కర్ణుడు)
వేరొక్కరు డస్థి నిచ్చె (దదీచి) 
నిక నొక్కడు ప్రాణములిచ్చె(బలి చక్రవర్తి )
వీరిలో నొక్కని పట్టునన్
బ్రతుకు నోపక యిచ్చిరొ కీర్తికిచ్చిరో...? 


సారాంశం:  ఇతరుల ప్రయోజనాలు, ఆర్తిని బట్టి ఆయా ప్రముఖులు  త్యాగనిరతి-కీర్తిని కాంక్షతో అవి ఇచ్చారు తప్ప జీవించ జాలక మాత్రం కాదని అర్ధం. 

అన్నీ సవ్యంగా వున్నప్పుడు నాయకత్వం అప్పగిస్తే సగర్వంగా స్వీకరించి, తోచిన తరహాలో సూచనలు-సలహాలూ, ఆజ్ఞ-ఆదేశాలూ యిస్తూ ఆధిపత్యం చాలాయించడమే కాదు! పరిస్థితి వికటించినపుడు, అదే చొరవతో ముందుకు వచ్చి భారమెంతని చూడకుండా భాద్యతను భుజాన వేసుకున్నవాడే "నిజమైన నాయకుడు"  

***అంతరం***

భూమిని చీల్చుకు వచ్చే అంకురంలా.. 
కన్న ప్రేగును తెంచుకు పుట్టిన బిడ్డ 

పైరు ఎదిగినాక నాటిన రైతు కోసం ఆత్మ త్యాగం
ఎదిగిన బిడ్డ కన్నవారికి మిగిల్చేది కన్నీరు 

ఆశపడిన రైతుకు కాసుల వర్షం... 
ఏదో.. చేస్తాడని నమ్మిన కుటుంబానికి.. 
కన్నీటి ధార  మిగులుస్తున్న నేటి తరం

మొక్కపాటి మానవత్వం లేని నేటి సమాజ
యువతకు కనువిప్పు కలిగేది ఏనాటికో.. 

తరాలు మారుతున్నా.. అంతరంగ ఖాళీని 
పూడ్చే రోజు  ఎనాడొస్తుందో...!    

                        ... గోపి బుడుమూరు

***మానవత్వం ***

మరుగున  పడిపోయిన మానవత్వాన్ని 
దీపం  పెట్టి వెతికి మాత్రం  ఏం ప్రయోజనం

నా.. అనుకున్న బంధాలన్నిటినీ ఎన్నడో 
నాన్చి.. నాన్చి.. తప్పులు వెతికి..  వెతికి.. మరీ 
కావాలనుకుని వచ్చిన  వారిని సైతం కాళ్ళదన్ని.. 

వయసు మీదపడి.. వైరాగ్యం మొదలై.. 
 ఏ బంధం కోసం..! వేదనతో.. వెర్రి చూపులు 

కడుపున పుట్టిన వారు.. నిన్ను, దేశాన్ని వదిలి దూరంగా విదేశాల్లో... 
నీ.. ఆదరణ, ఆప్యాయతలు... ప్రాణం లేని కంప్యూటర్ బొమ్మల్లో... 

ఆశలు కోల్పోయి.. అణగారిన జీవితపు చివరి అంచులలో.... 
పలకరింతకు సైతం పది మంది లేని  బ్రతుకెందుకు..?

మేలుకో.. మానవుడా...! యిది  జరగబోయే  నీ.. భవితవ్యం 
ఎన్నటికీ.. మరువకు, నీ.. తత్వమైన "మానవత్వం". 

                                                             .... గోపి బుడుమూరు 

  

*** ఉగాది ***


కొత్త ఆశల పరంపరతో.... 
తెలుగు సంవత్సర  ఆగమనం...
మామిడి పూతల మఖరంద మృదంగంతో... 
గొంతు కలిపిన కోకిల కుహూ.. కుహూ సన్నాయి రాగాలు. 
ఉగాది పచ్చడిల షడ్రుచుల సమ్మేళనం... 
జీవిత కలశంలో... కష్ట సుఖాల కలయిక. 

ప్రకృతి...  మంచు దుప్పట్లను వీడి,
భానుని పసిడి కిరణాలు తాకిన వేళ...
శిశిర  తిమిరాలను దాటుకుని 
పచ్చని పట్టు పరికిణి లో.... 
'వసంత' జిలుగులు రంగరించుకుంటున్న సమయాన ... 

మనసు నిండుగా నిండిన నూతన ఉత్తేజంతో... 
పలుకుతున్నా... సుమధుర "జయ" నామ సంవత్సర
కొత్త ఉగాదికి హృదయపూర్వక సుస్వాగతం    

                                          -- గోపి బుడుమూరు.