*** మాకే మాటుంటే..! ***

🌿 మా హృదయం మాట్లాడితే 🌿
(అడవి జంతువుల, పక్షుల వేదనకు స్వరం)

మేము ముందునుంచే వుండేవాళ్ళం 

అడివి చెట్లల్లో, పుట్లల్లో, రాళ్ళలో, పొదల్లో.. 

మీ తాతలతో  తగవులు లేవు 

మీ తండ్రులతో తంటాల్లేవు 

మీరు రాగానే మారింది మా జీవన దృశ్యం 

మర రంపపు మోతలతో నాశనమైంది మా ప్రపంచం.  

మీ ఇళ్ల వెలుగుల కోసం మా అరణ్యాన్ని అంధకారం చేసావు 

అభివృద్ధి అన్న పేరుతో మా జీవితాల్ని మింగేశావు 

మా బ్రతుకులపై చెరగని గాయాన్ని మిగులుస్తూ.. 

 జగతిని నాశనం చేసే ఈ ప్రయాణం ఎంత వరకు..!


మా  ఆక్రందనల ఘోష నీ చెవిన పడలేదా

మా నచ్చని వలస ప్రయాణ కన్నీరు కనపడలేదా 

మా అడవుల్లో చొరబడి వెంటాడినా.. వేటాడినా.. 

అడగలేమనే  హక్కుతోనే  కదా..  యింత విధ్వంశం 


భావి తరాల భవిష్యత్తుని పణం పెట్టి, 

ప్రకృతితో నీ ఆటలు... మానవజాతి వినాశనానికి బాటలు.  

జీవ వైవిధ్యం మన మనుగడకి కావాలి సోపానాలు. కానీ, 

మానవ,పశు, పక్షి, వృక్షజాలాలకు, కాకూడదు స్మశానాలు. 

                                                    --- నిష్ఠ (గోపి బుడుమూరు)










*** పుష్పాంజలి ***

                            నా జీవిత జ్ఞాపకాల అల్లికల వానలో 

                            ఓ అదృశ్య గొడుగులా నువ్వు వున్నావు నాన్నా!

                            నా కలల గమ్యాల పాదాలకు 

                            పాదరక్షలై  నీ అనుభవాలే దారిచూపాయి 

                            

                            మౌనంగా  మెరుస్తున్న నీ చూపుల్లో 

                            మాటల్లో చెప్పలేని నీ మమత వుంది 

                            నువ్వు నవ్వితే నాకు ఆకాశమైన దిగొస్తుంది 

                            నువ్వు బాధపడితే.. నా శ్వాసే ఆగిపోతుంది 


                            నేను చదివిన పాఠాలకంటే, మీరు 

                            మౌనంగా నేర్పిన జీవితం చాలా పెద్దది 

                            ఈ జీవితం మీరు నాకిచ్చిన బహుమతి 

                            మీ కలలకు, ఆశలకు, చేసిన త్యాగాలకు 

                            మీరు గర్వంగా మలచిన కొడుకుగా 

                            మీ పాదాలకు ప్రేమతో  పుష్పాంజలి 

                                                                                            -- నిష్ఠ (గోపి బుడుమూరు) 

                            

                            

                 

**** ప్రేమ పాఠం ****

 మన జీవితాల్లో సూర్యోదయం కావాలని 

నిద్రలేని రాత్రులు గడిపాను 

నా మనసున ప్రతి పొరపై నీ రూపం గీసుకున్నాను 

ఈ రోజు నిశ్శబ్ధం మాత్రమే నాకు తోడైంది 

నీ చిరునవ్వే నా లోకమనుకున్నా 

ఆ  నవ్వులు వేరొకరి సొంతమని తెలియక

గడిచిన క్షణాలు వెన్నెలగా భావించాను 

ఇంతటి వేదన జ్వాలల్ని రగిలిస్తాయని అనుకోక  

ఓ తరం మారింది, ఆ కల అలానే మిగిలింది 

ఆ ప్రేమ సాగరం చిక్కకపోయినా

ఆ గాలి పరిమళం నా ఊపిరిలో మిగిలింది 

నువ్వు నన్ను వదిలి పోయింది నిజమే 

కానీ, నువ్వు నేర్పిన పాఠం మరువలేనిది

విఫలమైన నా ప్రేమను నేను ఓటమిగా చూడను 

ఇకపై  నీకోసం ఆలోచించే ప్రతి క్షణం.. 

నా ఎదుగుదల కోసమే ఆలోచిస్తాను 

మన ప్రేమ ముగిసిన తర్వాతే... 

నా జీవితపు అసలైన కథ మొదలైంది

నన్ను ఉన్నత శిఖరాన వుంచింది ... :-)

                                                                       -- నిష్ఠ (గోపి బుడుమూరు ) 



*** నాన్న ***

 నా   నడకకు ఊతం తన చూపుడు వేలు 

నా  భవితకు ఆయనే పెద్ద భరోసా 

మా కుటుంబానికి భద్రత మరియు పెద్ద దిక్కు 

నేను  కనే కలలకు వెనుక అయన నిరంతర కష్టం 

సమాజంలో నన్ను ఉన్నత స్థాయిలో ఉంచాలని తన కోరిక 

కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరిగిపోతున్నా 

తనకోసం అంటూ తాను ఎప్పుడూ ఆలోచించని మహర్షి 

నా  ముందు కరుకైన మనసు, మృదువైన ఆవేశం

అదే అమ్మముందు అందరి ముందు మాత్రం 

నా పిల్లలంటే ఏమనుకున్నావోయ్..  అంటూ అందలంలో వుంచుతావు  

నువ్వు నాకో దార్శకుడివి 

నాకు.. నా కలలకు  మధ్య వారధివి 

నేను నా జీవితంలో ఏది పొందినా 

అది నువ్వు నా కోసం చేసిన త్యాగమే..  

నన్ను యింత  ఉన్నతంగా వుంచడానికి 

ఎన్ని కోల్పోయావో.. ఎన్ని వద్దనుకున్నావో.. 

నాన్నా... 

నువ్వేమిటో ... 

నువ్వు పడ్డ కష్టమేమిటో ... 

చేసిన త్యాగమేమిటో... 

నేను నాన్నైనాకే, బోధపడుతోంది. 

నాకు మళ్ళీ జన్మంటూ వుంటే.. 

నీకు నాన్నగా పుట్టి, 

నీ ఋణం తీర్చుకోవాలని వుంది నాన్నా.. 


                                                                                   ... నిష్ఠ (గోపి బుడుమూరు)


*** వందనం.. 🙏 ***

 ప్రపంచం స్థంబించడం అంటే ఇదేనా..!
అంతా నీ మహిమే అనుకుంటా కరోనా..!
కనిపించని జీవిలా మమ్మల్ని కబలిస్తున్నా..
కనిపించకుండా పోతున్న మానవత్వాన్ని 
మాకు గుర్తు చేశావు 
మనిషికి మనిషికి మధ్య సామాజిక దూరం పెట్టినా...
కుటుంబాల్ని గుమ్మంలోపలే వుంచి మనసుల్ని దగ్గర చేశావు.
పైసా వెనుక పరుగులు పెడుతూ..
యంత్రాలు సైతం సిగ్గుపడేలా మారిన 
యాంత్రిక జీవితంలో...
డబ్బు కన్నా ఆరోగ్యం మిన్న అని గుర్తు చేశావు..
నేను.. నాకే.. అంటూ స్వార్థ మై పోతున్న సమాజంలో..
స్వార్థ రహిత సేవ చేసే వారిని చూపి కళ్ళు తెరిపించావు.
నువ్వు మా ప్రాణాలు తీసే మహమ్మారివే అయినా...
మమ్మల్ని మాకు తిరిగి పరిచయం చేసిన నీకు వందనం.. 🙏🙏🙏


                                                                                                నిష్ఠ (గోపి బుడుమూరు)
కరోనా సమయంలో వ్రాసిన కవిత ఇప్పుడు ప్రచురించడమైనది. 

*** నా దేశం నడుస్తోంది... ***

 కరోనా మహమ్మారి కమ్మేసిన జీవితాలు 
చేసేందుకు పనిలేక,  తాగేందుకు గంజిలేక
నిలువు నీడలేక.. సాయమందించే తోడులేక
పట్నమెందుకొచ్చామురా.. మహాప్రభో అని రోదిస్తూ.. 
పల్లెవైపు నడుస్తోంది నా దేశం 

వేసవి వడగాల్పులు ఓ వైపు 
సముద్ర వాయుగుండాల తుఫాను ఓ వైపు
కాలే కడుపులు ఓ వైపు 
నెత్తిమీద కదలనివ్వని బరువులు ఓ వైపు
అయినా, కాళ్ళకు చెప్పులు లేక,
కనకనలాడే నిప్పుల కుంపటి రోడ్డుమీద
బొబ్బలెక్కిన పాదాలతో..
పల్లెవైపు నడుస్తోంది నా దేశం

అంటురోగమొకటి చంపుతుందని తెలిసినా
ఆకలి చావుని మించిన దయనీయ చావు వేరొకటి లేదని..
ఆగే దిక్కు లేక.. అడిగే హక్కు చాలక..
అలసిన వలస జీవికి వేరే వీలు తోచక..
అన్నమో రామచంద్రా అంటూ...
పల్లెవైపు నడుస్తోంది నా దేశం

నా దేశం "నడుస్తుంది".

నా దేశం "నడుస్తూంది".

నా దేశం "నడుస్తూనే వుంది"!! 

         

                                                       .... నిష్ఠ   (గోపి బుడుమూరు )

కరోనా సమయంలో రాసిన కవిత ఇప్పుడు ప్రచురించాను.. 

*** స్నేహితుడు ***


నిశ్శబ్ద క్షణాల్లో  ఒక గుండె చప్పుడు వినపడిందంటే 

ఖచ్చితంగా చెప్పగలను అది నా స్నేహితుడిదే 

భారమైన మనసుతో మూసుకున్న కళ్ళనుండి 

కన్నీటి బిందువు జారుతున్నప్పుడు 

ఏదైనా చేయి దానిని తుడిచిందంటే అది కూడా తనదే 

ఆవేశంలో పక్కన ఉండడం 

ఆలోచనలో మార్గం చూపడం 

నేనున్నానంటూ నమ్మకమివ్వడం 

గుండెలకు హత్తుకుని నా భారాన్నంతా దింపేయడం 

తనకు తప్ప వేరే ఎవరికీ తెలియని విద్యనుకుంటా...  

                                                              

                                                                                       ... నిష్ఠ (గోపి బుడుమూరు)

*** నేటి సమాజం ***

అడిగే గొంతును, 

అధికారం నొక్కేస్తుంది.  

కాదంటే.. కానరాని రౌడీల కత్తులతో కోసేస్తుంది. 

రాలిన నెత్తుటిని,

 కళాలు.. సిరాకింద  వాడుకొని, 

అన్యాయంపై కోకొల్లలు కావ్యాలు రాశాయి.  కానీ, 

అదే.. అడిగే మరో గొంతుక కాలేకపోయాయి.

నరాలు చచ్చుపడిన నవ సమాజంలో 

మచ్చుకైనా ఒక పిడికిలి పైకి లేవలేకపాయె.. 

తల దించుకు పోవటం అలవాటైన జనాలకు 

తలెగరేసే రోజు ఎప్పుడొస్తుందో...?
                                                                ... నిష్ఠ (గోపి బుడుమూరు)



*** చివరి రోజులు ***

 మనిషి జీవన యాత్ర ముగియకుండా సాగితే.. 

ఇక పెరిగిన వయసులో వేరొకరిపై  ఆధారం. 

ఉద్యోగ  విరమణ  పొంది 

జేబులు ఖాళీ అయిన  తరువాత 

కన్నవాళ్ళ నమ్మకాలు గల్లంతై 

కాచుకున్న సంపదలు చేతులు మారాక 

పిల్లలు అందనంత ఎత్తు ఎదిగిపోతే...

మా వైపు తిరిగి చూసే సమయం లేకపోతే 

తమ ఆనందాలకు మేమే అడ్డని భావించి 

తమని బ్రతికించిన మా బ్రతుకులే 

భారమని భావించి రోడ్డున పడేస్తే... 

కళ్ళల్లో కన్నీటి జాడలతో 

ఏవేవో ఆలోచనలతో గుండె కొట్టుకుంటుంటే... 

అసహనంగా, నిస్సత్తువుగా... 

కదులుతున్నాయి మా కాళ్ళు వృద్ధాశ్రమం వైపు..

పిల్లల చివరి చూపుల పై ఆశలు సన్నగిల్లిన 

మా మనసుల ఆలోచనలు మహా ప్రస్థానం వైపు. 

                                                  

                                                                               .. నిష్ఠ ( గోపి బుడుమూరు)





*** బాల్య స్నేహం ***

 బాల్యంలో పసి మనసులు కలసిన వేళ

నవ నడవడికి బాటలు వేస్తున్న వేళ

మచ్చుకైనా మాయ తెలియని మనసులు 

స్వచ్ఛమైన నవ్వులు

ఇష్టమైన ప్రేమలు 

ఆటలు

పాటలు 

అల్లరి చేష్టలు... 

ఎందుకైనా దుఃఖం అంటే తెలియని రోజులు 

ఎంత ఎదిగినా మరపురానివి,

మారచిపోలేనివి  బాల్య స్నేహాలు 

                                                         ... నిష్ఠ (గోపి బుడుమూరు)